ఆ ఘనత గాందీ ఆస్పత్రికే దక్కింది.. హరీశ్ రావు
కరోనా సమయంలో 84 వేల మందికి వైద్య సేవలు అందించిన ఘనత గాంధీ ఆస్పత్రికే దక్కిందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు అన్నారు. అధునాతన సౌకర్యాలతో గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యూనిట్‌ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బతడకం కష్టం అనే స్థితిలో ఉన్న వారికి సైతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించి ప్రాణాలు పోశారని కితాబిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 సీటీ స్కాన్ యూనిట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. గాంధీలో గత రెండేళ్లుగా క్యాథ్ ల్యాబ్ పనిచేయక పోవటంపై అధికారులతో చర్చించానని, త్వరలోనే క్యాథ్ ల్యాబ్‌ని తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గాంధీలో ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయని వైద్యులు తెలిపారని, త్వరలో మరో 200 పడకలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో ఆందోళన అవసరం లేదని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కేవలం 15 మందికి మాత్రమే కొవిడ్ పాజిటివ్‌గా తేలిందన్నారు. వారిలో ఇప్పటికే 13 మందికి ఒమిక్రాన్ నెగెటివ్‌గా నిర్థారణ అయిందని, మరో ఇద్దరికి సంబంధించిన సీక్వెన్సింగ్ ఫలితాలు రావాల్సి ఉందని అన్నారు.













