పరీక్షల సంఖ్య పెంచండి… బెడ్ల సంఖ్యను పెంచండి : సీఎస్ సోమేశ్ కుమార్
తెలంగాణలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అన్ని శాఖల ముఖ్య అధికారులు హాజరయ్యారు. కోవిడ్ పేషెంట్ల కోసం ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో బెడ్ల సంఖ్యను పెంచాలని సూచించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ కేసులు పెరిగితే ఎదుర్కోడానికి కూడా సిద్ధంగా ఉండాలని అన్నారు. అలాగే జిల్లా కేంద్రాల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించేలా చూడాలని, కోవిడ్ కేర్ సెంటర్ల సంఖ్యను పెంచాలన్నారు.
రాత్రి కర్ఫ్యూ విధిస్తారా?
తెలంగాణలో రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని శాఖల ముఖ్యులతో సమావేశమయ్యారు. అయితే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధిస్తే ఎలా వుంటుంది? అన్న అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ, పంజాబ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి నైట్ కర్ఫ్యూను విధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా ఇదే ఫాలో కావాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం ఇంకా రాలేదు. సీఎస్ సోమేశ్ కుమార్ ఇదే అంశంపై సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.













