భారత్ బయోటెక్ ప్రతినిధులతో… సీఎస్ భేటీ
కొవిడ్ టీకాల పంపిణీలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వీలైనన్ని ఎక్కువ డోసులు అందించాలని భారత్ బయోటెక్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు టీకాల విషయమై భారత్ బయోటెక్ ప్రతినిధులతో సీఎస్ చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఈ క్రమంలో వీలైనన్నీ ఎక్కువ డోసులు రాష్ట్రానికి ఇవ్వాలని కృష్ణ ఎల్లకు సీఎస్ విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తి మేరకు రాష్ట్రానికి ఎక్కువ డోసులిచ్చేందుకు భారత్ బయోటెక్ ఎండీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి ఎక్కువ టీకాలు ఇస్తామని కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.













