దేశంలోనే తెలంగాణ ముందు … 2 కోట్ల మందికి
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కోవిడ్ వ్యాక్సినేసన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకూ 2 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. బీఆర్కే భవనంలో జరిగిన సమావేశంలో ఆయా శాఖల అధికారులను సీఎస్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ దేశంలో ముందు వరుసలో ఉందన్నారు.
చాలా తక్కువ సమయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, జిల్లా అధికారులు అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. అర్హులైన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడంలో అధికారులు, సిబ్బంది నిరంతరంగా శ్రమించారని అన్నారు. 2021 జనవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించమని తెలిపారు. జూన్ 25 నాటికే కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారని తెలిపారు. 78 రోజుల్లో మరో కోటి మందికి కోవిడ్ టీకా ఇచ్చినట్టు తెలిపారు.
ఈ నెలాఖారు నాటికి రాష్ట్రంలో మరో కోటి మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 52 శాతం మంది ఒక డోసు టీకా తీసుకున్నట్టు తెలిపారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు వందశాతం వ్యాక్సినేషన్ జరిగిందని వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఓఎస్డీ గంగాధర్, వైద్య శాఖ సంచాలకులు జీ శ్రీనివాస్ పాల్గొన్నారు.













