విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత పెంచాలి – ఉపరాష్టపతి
* హైదరాబాద్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శ్రీ ఎం.వెంకయ్యనాయుడు
* రైతు నేస్తం అవార్డులను అందజేసిన ఉపరాష్ట్రపతి
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత పెంచాలని, అత్యంత ప్రాధాన్యత గలిగిన ఈ మూడు రంగాలకు చట్టసభలు, రాజకీయపార్టీలు, పత్రికలు, ప్రభుత్వాలు పెద్ద పీట వేయాలని ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. హైదరాబాద్ ముచ్చింతల్ లో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఇదే వేదిక మీద రైతు నేస్తం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
గ్రామాలకు తిరిగి రండి అంటూ గాంధీజీ ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని రైతులు మహిళలు, యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా 2001లో స్థాపించిన స్వర్ణభారత్ ట్రస్ట్… ప్రభుత్వ సహకారం, విదేశీ సహకారం లేకుండా ముందుకు సాగుతోందంటే దానికి అండగా నిలిచిన మిత్రులే కారణమని ఉపరాష్ట్రపతి తెలిపారు. కుటుంబ సభ్యులు వారసత్వంగా బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావడం కూడా ట్రస్ట్ ఎదుగుదలకు మరో కారణమని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఆయన కుమార్తె దీప వెంకట్ కు అభినందనలు అందజేశారు. ఆరోగ్యకరమైన సమాజమే, ఆర్థికంగా ఉన్నతి పొందిన భవిష్యత్ కు బాటలు వేస్తుందని తెలిపారు. వైద్యశిబిరం ద్వారా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వైద్యులు పరీక్షలు చేయడంతో పాటు ఆహారం విషయంలో జాగ్రత్తలు, వ్యాయామం, యోగ లాంటి విషయాల్లో సూచనలు చేయాలని తెలిపారు.
ఇదే వేదికగా రైతునేస్తం పత్రిక 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేస్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, స్వర్గీయ శ్రీ ఐ.వి.సుబ్బారావు గారి పేరిట రైతునేస్తం పురస్కారాలను ఉపరాష్ట్రపతి అందజేశారు. ఈ సందర్భంగా 14 ఏళ్ళుగా పురస్కారాలు అందిస్తున్న రైతునేస్తం పత్రిక ఎడిటర్ శ్రీ వై.వెంకటేశ్వర రావును ఉపరాష్ట్రపతి అభినందించారు. రైతునేస్తం అనే పేరును పత్రికకు పెట్టుకున్నందుకు సార్ధకత చేకూరే పని చేస్తున్నారని తెలిపారు. పురస్కారాలను ప్రదానం చేసి, మంచి పనిని ప్రోత్సహించడం భారతీయ సంస్కృతి అని, ఇది మరికొందరిలో స్ఫూర్తిని నింపుతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు.
కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు కేటాయింపులు పెంచాలని, కొత్త ఆలోచనలు పంచాలని, ఈ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సమానంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి వివరించారు. వ్యవసాయం లాభసాటి కానప్పుడు, రైతులు వ్యవసాయం నుంచి దూరం వచ్చే ప్రమాదమూ లేకపోలేదని, అది దేశానికే ప్రమాదమని గుర్తుంచుకోవాలని ఉపరాష్ట్రపతి అన్నారు.
ఆరోగ్య వైద్య శిబిరానికి విశేష స్పందన
స్వర్ణభారత్ ట్రస్ట్ మరియు ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ సాగిన ఈ వైద్య శిబిరంలో ఈసీజీ, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్, ఎత్తు, బరువు లాంటి సాధారణ పరీక్షలో పాటు, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, ఆర్ధోపెడిక్, పల్మొనాలజీ, ఇంటర్నల్ మెడిసిన్, జనరల్ మెడిసిన్ లాంటి వివిధ సేవలు అందించారు. ముచ్చింతల్ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ వైద్య శిబిరానికి పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
డా.వెల్చాల ప్రవీణ్ రావుకు జీవన సాఫల్య పురస్కారం, డా.ఖాదర్ వలికి కృషిరత్న బిరుదు ప్రదానం
రైతు నేస్తం పత్రిక 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో కృషి చేసిన 15 మంది అభ్యుదయ రైతులు, 9 మంది శాస్త్రవేత్తలు, 10 మంది విస్తరణ అధికారులు, 8 మంది వ్యవసాయ పాత్రికేయులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. వెల్చాల ప్రవీణ్ రావుకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆరోగ్య-ఆహార నిపుణులు డా.ఖాదర్ వలి గారికి కృషి రత్న బిరుదును ప్రదానం చేశారు.













