మునుగోడు ఉప ఎన్నికల్లో మా మద్దతు వారికే
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతిస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కి ఎందుకు రాజీనామా చేశారని నిలదీశారు. మునుగోడులో బీజేపీను గెలిపిస్తే నెలరోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారని, పూర్తి మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు, ఈడీతో బెదిరింపులకు బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆక్షేపించారు. రాబోయే ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారే అవకాశముందన్నారు. కాంగ్రెస్ స్థానంలో ఉండేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోందన్నారు. సీపీఐలా తాము దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోలేదని మునుగోడు ఉప ఎన్నిక వరకే టీఆర్ఎస్కు మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు. బీజేపీ వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.













