సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ అడుగుజాడల్లో : చాడ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో నడుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామనే ప్రతిపాదనను సీఎం విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్మికులను ఉద్దేశించి నాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రాకపోతే ప్రైవేటీకరిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రైవేట్‌పరం చేయడానికి అడుగులు వేస్తున్నారని అన్నారు.
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వలో విలీనం చేసుకొని లాభాలతో నడిపిస్తున్నారని, తెలంగాణలో విలీనం చేయకుండా ప్రైవేటీకరిస్తామని చెప్పడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడానికి అనేక మార్గలు ఉన్నాయన్నారు. డీజిల్ దరలపై వ్యాట్ తగ్గిస్తే కొంతమేర ఉపశమనం కలుగుతుందని అన్నారు. ప్రజారవాణ వ్యవస్థను మెరుగు పరిచి, ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని అన్నారు.













