మహేశ్ భగవత్ కు అమెరికా ప్రభుత్వం నుంచి మరో అవార్డు
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌కు అమెరికా ప్రభుత్వం నుంచి మరో అరుదైన అవార్డు దక్కింది. ఇటుక బట్టీల్లో వెట్టి చాకిరీ నిర్మూలనకు ఆయన చేసిన కృషికి అమెరికాకు చెందిన ఐఏసీపీ(ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్) సంస్థ గుర్తించింది. మహేశ్ భగవత్ వెట్టి చాకిరీ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై అధ్యయేనం చేసి ఆయనకు 2018-ఐఏసీపీ లీడర్షిప్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును అమెరికాలో అక్టోబరు 9వ తేదీన వాలెన్సియా బాల్రూమ్ ఆఫ్ అరెంజ్ కంట్రీ కన్వెన్షన్ సెంటర్లో సీపీ మహేశ్ భగవత్‌కు అమెరికా ప్రభుత్వం అందించనున్నది. మహేశ్ భగవత్ చేసిన సేవలు మానవహక్కులను పరిరక్షిస్తున్నాయని ఆ సంస్థ కొనియాడింది. సీపీ చేపట్టిన కార్యక్రమం ఎంతో మంది చిన్నారుల బాల్యం ఇటుక బట్టీల్లో ముగ్గిపోకుండా వారి జీవితాల్లో వెలుగు నింపిందని, అందుకే ఈ అవార్డును ప్రకటించామని ఐఏసీపీ అధ్యక్షుడు లూయిస్ ఎం డెక్మార్ లేఖ ద్వారా సీపీకి తెలియజేశారు.
మనుషుల అక్రమ రవాణకు సంబంధించిన 13 ఏండ్లపాటు సీపీ మహేశ్ భగవత్ చేసిన కృషికి 2017 అమెరికా హిరో టిప్ అవార్డును గత ఏడాది సీపీ అందుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన మరో అవార్డును అందుకోనుండటంతో అమెరికా ప్రభుత్వం నుంచి రెండుసార్లు అవార్డును అందుకున్న పోలీసు ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించనున్నారు.













