తెలంగాణలో సెకండ్ వేవ్ ముగిసింది : డీహెచ్
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. కింగ్‌కోఠిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొవిడ్ చాలావరకు అదుపులోకి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జ్వరం వస్తే కొవిడ్ కారణంగానే సంక్రమించిందని అనుకోవద్దని ప్రజలకు సూచించారు. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భదాద్రి ములుగు జిల్లాల్లో 340 మలేరియా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1200కు పైగా డెండీ కేసులు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రం వ్యాప్తంగా 20 జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు నడుస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.65 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 56 శాతం మందికి మొదటి డోస్, 34 శాతం మందికి రెండో డోసు వేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 90 శాతం ప్రజలకు తొలి డోసు ఇచ్చినట్లు తెలిపారు.













