తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శం : గుత్తా
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నల్గొండ జిల్లా రైతాంగానికి వ్యవసాయ పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో 4 లక్షల 83 వేల 179 మంది రైతులకు 5 వేల 243 కోట్ల 99 లక్షల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. దురదృష్టవశాత్తు ఏ రైతు అయిన మరణించినచో 10 రోజుల్లో అతని కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా సొమ్మును రైతు బంధు పథకం ద్వారా అందిస్తున్నామని అన్నారు. ఈ పథకం ద్వారా 2018 నుండి 2023 ఏప్రిల్ వరకు 6 వేల 256 మంది రైతు కుటుంబీలకు 312 కోట్ల 8 లక్షల రూపాయలు అందించామని తెలిపారు.













