టెస్ట్ కరోనా!
కరోనా నియంత్రణలో దేశంలో అతి కొద్ది రాష్ట్రాలు చక్కగా పనిచేస్తున్నాయి. అందులో తెలంగాణ ఒకటి. ఇది సహజంగానే తెలంగాణ ప్రజలకు సంతోషం కలిగిస్తుంటే, కొంతమందికి మాత్రం ఎక్కడలేని అజీర్తి కలుగుతోంది. సో! ఇప్పుడో కొత్త రాగం ఎత్తుకున్నారు. తెలంగాణలో కరోనా పరీక్షలు తగినన్ని చేయడం లేదు. ఫలానా రాష్ట్రం ఎక్కువ టెస్టులు చేస్తోంది కాబట్టి తెలంగాణ కూడా ఎక్కువ టెస్టులు చేయాలి. ఇలాంటి డిమాండ్లు చేస్తున్న వారిలో చాలామంది “కాళేశ్వరం – కరెంటు బిల్లు” బ్యాచి వారే కావడం యాధృచ్చికం ఏమీ కాదు. ఎడ్డెం అంటే తెడ్డెం అనడం వీరికి కొత్తకాదు కదా.
ముందుగా కొన్ని ప్రాధమిక సంగతులు.
– కరోనా నియంత్రణ అనేది దేశవ్యాప్త సమస్య కాబట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల మార్గదర్శకాలు విడుదల చేసింది. లాక్డౌన్ అయినా, టెస్టులు అయినా చాలావరకూ కేంద్రం కనుసన్నల్లోనే నడుస్తోంది.
– ఎవరికి టెస్టులు చేయాలనే విషయం మీద కేంద్ర ప్రభుత్వ సంస్థ ICMR స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చింది. తెలంగాణ కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారమే టెస్టులు చేస్తుంది
తెలంగాణ చేస్తున్న టెస్టులను RT-PCR టెస్టులు అంటారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణకు వాడే అత్యుత్తమ టెస్టులు ఇవి. ఎక్కువ టెస్టులు చేశాం అని గొప్పలు పోతున్న రాష్ట్రాలు ఎక్కువగా TRU-NAT తరహా టెస్టులు చేస్తున్నాయి. ఇవి నాసిరకం, నమ్మదగినవి కావు అని కేంద్రం ఆల్రెడీ చెప్పింది. పనికిరాని ఈ టెస్టులు ఎన్ని చేస్తే ఏం లాభం? మన దేశంలో సగటున 24 మందిని పరీక్షిస్తే ఒక్కరు పాజిటివ్ వస్తున్నారు. అంటే వందమందిని అనుమానితులను పట్టుకొచ్చి పరీక్ష చేస్తే అందులో కేవలం నలుగురికే పాజిటివ్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేస్ పాజిటివిటీ రేట్ చూసినప్పుడు ఇది మంచి అంకెనే. అదే ఇటలీలో వంద టెస్టులకు దాదాపు 13 మందికి పాజిటివ్ వస్తే, అమెరికాలో ప్రతి వంద టెస్టులకు 20 మందికి పాజిటివ్ వస్తోంది. ఫ్రాన్స్ లో ఏకంగా వంద టెస్టులకు 34 మందికి పాజిటివ్ వస్తోంది.
ఇంకో చివర మన పొరుగు దేశం భూటాన్‌లో 8700 మందికి టెస్టు చేస్తే వచ్చింది కేవలం ఆరు పాజిటివ్ కేసులు – అంటే కేవలం 0.07% అన్నట్టు. మరి ఇంత వైరుధ్యం ఎందుకున్నది? ఇటుచివర భూటాన్‌లో వంద టెస్టులు చేస్తే కేవలం 0.07 శాతం మందికే పాజిటివ్ వస్తే అటు చివర ఫ్రాన్స్‌లో వంద టెస్టులకు 34 మందికి పాజిటివ్ ఎందుకు వచ్చినట్టు? ఎందుకంటే వ్యాధి ఒకటే అయినప్పటికీ ఆయా దేశాల్లో ఈ వ్యాధి ఒక్కో విధంగా ప్రవర్తిస్తున్నది. ఉదాహరణకు దక్షిణాసియా దేశాల్లో ఈ వ్యాధి కొంత వేరేవిధంగా వ్యాపిస్తున్నది. కరోనా నియంత్రణ అనేది అనేక చర్యలతో కూడిన ఒక వ్యూహంతో సాధ్యమవుతుంది. అందులో టెస్టింగ్ అనేది ఒక ప్రక్రియ. అదొక్క దానితోనే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఏ రాష్ట్రం, ఏ దేశం పరిస్థితులని బట్టి, అవసరాన్ని బట్టి అక్కడ టెస్టింగ్ చేస్తారు. అంతే కానీ నువ్వు డిమాండ్ చేసావనో, నేను డిమాండ్ చేశాననో టెస్టులు చేయరు భయ్యా.













