తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. ఈ ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 229కి చేరింది. కరోనాతో ఈరోజు ఇద్దరు మృతిచెందారు. సికింద్రాబాద్, షాద్ నగర్‌కు చెందిన వ్యక్తులు మృతిచెందగా, మృతుల సంఖ్య 11కి చేరింది. మరోవైపు కరోనా సోకి కోలుకున్న వారిలో 15 మంది డిశ్చార్జ్ అవగా, ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 32కి చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో 186 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఢిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించినట్లు మంత్రి ఈటల తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారందరినీ ఐసోలేషన్ వార్డులకు తరలించామని యుద్ధప్రాతిపదికన కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.













