తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
తెలంగాణాలో ఈరోజు మరో10 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఒక్క రోజే 10 మందికి కరోనా సోకడంతో ఇప్పటి వరకూ ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 59కి చేరింది.. ఇక ఏపిలో కొత్తగా ఈ రోజు ఒక కొత్త కేసు నమోదైంది.. దీంతో ఇప్పటి వరకూ కరోనా సోకిన వారి సంఖ్య 12కి చేరింది. కాగా, కరోనా బాధితుల్లో ఏ ఒక్కరూ కూడా విషమ పరిస్థితుల్లో లేరని తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తేల్చిచెప్పారు. కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో వైద్యశాఖ ఉన్నతాధికారులు, ప్రయివేటు వైద్య కాలేజీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. మొదటి దశలో ప్రభుత్వ ఆస్పత్రులను వాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 22 ప్రయివేటు వైద్య కళాశాలలు ఉన్నాయని, రెండో దశలో వాటిని వాడుకునేందుకు కాలేజీల ప్రతినిధులను కోరామని తెలిపారు. ప్రయివేటు వైద్య కళాశాలల్లోనూ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా చికిత్స అందించేందుకు ప్రయివేటు వైద్య కాలేజీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. కరోనా బాధితుల కోసం 10 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయన్న మంత్రి.. 700 ఐసీయూలు, 190 వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రస్తుతానికి కరోనా బాధితుల్లో ఇతరత్రా సమస్యలు లేవు అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కడా కరోనా వ్యాప్తి లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచే ఈ వ్యాధి వచ్చిందన్నారు. వారి కుటుంబ సభ్యులకే కరోనా సోకింది అని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు













