శిక్ష తప్పదు.. ఓ సెల్ ఏర్పాటు చేశాం
ప్రాణాలకు పణంగా పెట్టి కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నారాయణగూడలోని ఐపీఎంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తనకు ఏ దేవుడు లేడు.. వైద్యుడే దేవుడు అన్నాడు. అలాంటి వైద్యులపై కొందరు శాడిస్టులు దాడి చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డాక్టర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ల కుటుంబాల్ని పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్లపై దాడి చేసిన పేషంట్లను శిక్షించేందుకు ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేశాం అని మంత్రి పేర్కొన్నారు.













