బెడ్ ఇవ్వండి.. లేదా మా నాన్నను చంపేయండి

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరిగిపోయాయి. ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో ఆస్పత్రుల్లో బెడ్లన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. పేషంట్లకు బెడ్లు దొరకడం లేదు. తెలంగాణలోని హైదరాబాద్‍లో కరోనా పేషెంట్లకు ఆస్పత్రుల్లో బెడ్లు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని చంద్రపూర్‍కు చెందిన సాగర్ కిషోర్ అనే వ్యక్తి విన్నపం అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది. కరోనాతో బాధపడుతున్న తన తండ్రిని రక్షించుకోవడానికి ఆయన ఎంతో ప్రయత్నిస్తున్నాడు. చంద్రపూర్ శివారు ప్రాంతాల్లో ఆసుపత్రులన్నీ పేషెంట్లతో కిక్కిరిసిపోయాయి. వృద్ధులైన పేషెంట్లు ఎంతో మంది ఆసుపత్రుల ఎదుట అంబులెన్సుల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సాగర్ కిషోర్ తన తండ్రిని హైదరాబాద్‍కు తీసుకువచ్చి బెడ్ కోసం ఎంతో ప్రయత్నించాడు. ఇక్కడ కూడా బెడ్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
దీంతో ఆస్పత్రిల్లో బెడ్ ఇవ్వండి లేదా ఆయనను చంపేయండి అంటూ కంటతడి పెట్టుకున్నాడు. అటు మహారాష్ట్రలో, ఇటు హైదరాబాద్‍లో బెడ్ దొరకకపోవడంతో ప్రస్తుతం సాగర్ కిషోర్ తండ్రి ఒక అంబులెన్సులో ఉన్నారు. అంబులెన్సులోనే ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నారు. మరోవైపు అంబులెన్సులో సాగర్ తండ్రికి అమర్చిన ఆక్జిజన్ అయిపోతోంది. దీంతో తన తండ్రికి బెడ్ ఇవ్వండి.. లేదా ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి ఆయనను చంపేయండని సాగర్ కిషోర్ కంటతడి పెట్టాడు. బెడ్ ఇచ్చి చికిత్స అందించాలని లేకపోతే తన తండ్రిని ఇంటికి తీసుకెళ్లబోనని స్పష్టం చేశారు.