తెలంగాణ సీఎస్‌కు కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వంలో ఉన్నతాధికారులను సైతం వైరస్ మహమ్మారి వదలడం లేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కొవిడ్ సోకినట్లు సీఎస్ స్వయంగా వెల్లడించారు. నిత్యం వివిధ శాఖలతో ఎడతెరిపిలేని సమీక్షలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన.. కాస్త అస్వస్థతగా ఉండటంతో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.
పరీక్షల్లో వైరస్ బారిన పడినట్లు తేలింది. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రోజువారీ కార్యకలాపాలకు కొన్ని రోజులు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఇటీవల సీఎస్‌ను కలిసిన వారిలో ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లయితే తక్షణమే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇవాళ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.













