కదన ఖమ్మం…
ఖమ్మం ఖిల్లా నుంచి కాంగ్రెస్ సమరశంఖారావం పూరించనుంది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా సంక్షేమపథకాలతో మేనిఫెస్టో విడుదల చేయనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ హాజరవుతున్న ఈసభకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యేలా భారీగా ఏర్పాట్లు చేశారు. వివిధ నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈసభతో తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పై అంచనాలు పెరుగుతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఇప్పటికే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకూ పాదయాత్ర చేసిన సీఎల్పీనేత భట్టి విక్రమార్క ముగింపు కూడా ఈ సభే కానుంది. మరోవైపు వివిధ వర్గాల ప్రజల సమస్యలు, వారేం కోరుకుంటున్నారన్న అంశాలపై భట్టి విక్రమార్క సూచించిన అంశాలను మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ నేతలు పొందుపరచనున్నారు. మరోవైపు ఇప్పటికే టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం పాదయాత్ర నిర్వహించారు. వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ ముందుకు సాగారు. మరోవైపు నియోజకవర్గాల్లో సైతం నేతలు పాదయాత్రలు చేస్తూ.. ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
ఇక ఖమ్మంలో కీలకనేతగా భావిస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. వందలాదిగా పొంగులేటి అనుచరులు కూడా కాంగ్రెస్ లో జాయినవుతారు సభలో మాజీమంత్రి జూపల్లి సహా పలువురు నేతలు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరితో పాటు చాలా మంది బీఆర్ఎస్, బీజేపీనేతలు పార్టీలో జాయినవుతారు.దీంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
రాహుల్‌గాంధీతోపాటు కర్నాటక డీప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఏఐసీసీ, పీసీసీ నేతలు ఈ సభకు హాజరుకానున్నారు. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున ఈ సభ ఎన్నికల శంఖారావానికి వేదిక కానుందని, రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని తెస్తుందని నేతలు ఆశిస్తున్నారు.













