జాతీయ పార్టీ పెడతానంటే… దేవుడు వరం ఇస్తాడా?
సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. పాపాల పరిహారం కోసమే కేసీఆర్ యాదాద్రికి కానుకలు ఇస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చేసినంత దోపిడీ దేశంలో ఎవరూ చేయలేదని ఆరోపించారు. దోపిడీ చేసి జాతీయ పార్టీ పెడతానంటే దేవుడు వరం ఇస్తాడా? అని ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ పేరుతో సొంత విమానం కొనడం కేసీఆర్ దోపిడీకి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్ పాలనలో దేవాదుల ప్రాజెక్టులో మూడో మోటరు ఎందుకు నడపలేదని ప్రశ్నించారు. వరంగల్‌లో అండ్ గ్రౌండ్ డ్రైనేజీకి ఇప్పటి వరకు ఒక్క పైసా ఎందుకు ఖర్చు చేయలేదని నిలదీశారు. వరంగల్ ఏయిర్‌పోర్టుకు ఒక్క పైసా మంజూరు చేయలేదన్నారు. టెక్ట్స్‌టైల్ పార్కు హామీ ఎటుపోయిందని అర్థం కావట్లేదని అన్నారు. భద్రకాళి దేవాలయం వద్ద ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. వరంగల్ పర్యటనలో జిల్లా ప్రజలకు వీటిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.













