రాజ్యసభకు ప్రొ. కోదండరామ్ ?
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ప్రస్తుతం శాసన సభలో ఉన్న సభ్యుల సంఖ్యాబలం దృష్ట్యా ఇందులో రెండు స్థానాలు కాంగ్రెస్కు దక్కే అవకాశం ఉంది. వాటిలో ఒకటి ప్రొఫెసర్ కోదండరాంకు కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్నికల ముందు కరీంనగర్లో ప్రొఫెసర్ కోదండరాం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొత్తులో భాగంగా నాలుగు అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన అధినాయకత్వం ప్రస్తుతానికి ఇవ్వలేమని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు అవకావం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఖాళీ అయ్యే పోస్టుల్లో ఒకటి కోదండరాంకు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వంతో పేర్కొన్నట్టుగా సమాచారం. మరో పోస్టు కోసం భారీగా పోటీ ఉందని తెలుస్తోంది.













