అది తప్పుడు వ్యాపారమా? : కోమటిరెడ్డి
కాంట్రాక్టర్‌గా ఉండటం తప్పా, అది తప్పుడు వ్యాపారమా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాజకీయంగా తలపడలేక తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వడం లేదన్నారు. అవినీతిపై ప్రశ్నిస్తుంటే కాంట్రాక్టర్ అంటున్నారు. కాంట్రాక్టులు అడ్డుకున్నా అధికార పార్టీకి లొంగలేదన్నారు. లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు రూ.లక్షల కోట్లు ఇచ్చి కమీషన్లు దోచుకుంటున్నారు. సింగరేణిలో 20 వేల కోట్ల అవినీతి జరిగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకని అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజలే ఆలోచించి కుటుంబ పాలనను అంతమొందించాలన్నారు.













