అక్కడ మూడు రాజధానుల కంటే… మూడు రాష్ట్రాలు చేస్తే మేలు
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల కంటే మూడు రాష్ట్రాలు చేస్తే మేలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానులు చేస్తే సీఎం పదవి కోసం జగన్ కుటుంబంలో ఉన్న గొడవ తీరుతుందని ఎద్దేవా చేశారు. కుటుంబ పంచాయితీని జగన్, షర్మిల తెలంగాణకు వచ్చి పెట్టడం సరికాదన్నారు. నేను మంత్రి కేటీఆర్ కోవర్ట్ అని షర్మిల అనడం దురదృష్టకరం. ప్రధాని మోదీకి సీఎం జగన్ గులాంగిరీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల గొడవ నడుస్తోంది. అక్కడ మూడు రాజధానుల కంటే మూడు రాష్ట్రాలు చేసుకుంటే ముగ్గురు ముఖ్యమంత్రులవుతారు. అప్పుడు జగన్, షర్మిల, విజయసాయిరెడ్డి సీఎంలు అవుతారు. నేను కేటీఆర్ కోవర్ట్ అని మా పార్టీ వాళ్లూ బద్నాం చేస్తున్నారు. షర్మిల నా జోలికి రాకుంటే నేను ఆమె జోలికి వెళ్లను అని అన్నారు.
గతంలో ఆరోగ్యశ్రీ పథకంతో పేదలకు మంచి వైద్యసేవలు అందేవి. ఇప్పుడు ఆ పథకం సరిగా అమలు కావడం లేదు. క్యాన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగారం, ఆస్తులన్నీ అమ్మకుని వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ పథకం బాగా అమలైంది. ఎవరైనా వైద్యం చేయించుకుంటే సీఎం సహాయనిధి నుంచి రూ.10 లక్షలకు కేవలం రూ.30 వేలు మాత్రమే వస్తోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కోరుతున్నా అని అన్నారు.













