సాగర్ ఎన్నికలో తాము భారీ మెజార్టీతో గెలుస్తాం : ఠాగూర్
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బు, మద్యంతో గెలవాలని ప్రయత్నిస్తోందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాగూర్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగర్ ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే తాము భారీ మెజార్టీతో గెలుస్తామనే సంకేతాలున్నాయన్నారు. ప్రజల పక్షాన జానారెడ్డి వాయిస్ అసెంబ్లీలో ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జానారెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన జరుగుతోందని విమర్శించారు. పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియామావళి ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. దుబ్బాకలో బీజేపీ విజయం నీటి బుడగ లాంటిదని తేలిపోయిందన్నారు. 2018లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని, సాగర్ కూడా బీజేపీకి అదే రిపీట్ అవుతుందని అన్నారు.













