హైదరాబాద్ కు మారిన కన్నడ రాజకీయాలు
కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. కర్ణాటక రాజకీయం కాస్తా హైదరాబాద్‌కు చేరింది. బీజేపీ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరు పార్టీల ఎమ్మెల్యేలను రెండు ప్రైవేటు బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. ఎమ్మెల్యేలను సురక్షితంగా కాపాడుకోవడానికి హైదరాబాదే సరైన ప్రదేశమని కాంగ్రెస్, జేడీఎస్ భావించి ఇక్కడికి తరలించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముందుగా పార్క్ హయత్‌కు వెళ్లాలని భావించిన ఎమ్మెల్యేలు, భద్రత పరంగా అనుమానాలు వ్యక్తం కావడంతో ప్లాన్ మార్చుకున్నారు. దీంతో జేడీఎస్ ఎమ్మెల్యేలు నోవాటెల్ హోటలకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాజ్‌కృష్ణకు చేరుకున్నారు.
కర్ణాకట ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల వద్ద హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హోటళ్లలోకి ఇతరులెవరినీ పంపించడం లేదు. ముఖ్యమైన వారిని సైతం క్షుణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు బీజేపీ వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ తమ సభ్యులను ఎలాగైనా కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.













