హైదరాబాద్ నగర స్వచ్ఛతకు కలిసి రండి : కేటీఆర్
హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ కలిసి రావాలని తెలంగాణ మున్సిపల్, ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత స్వచ్ఛంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సమయంలో పటిష్ఠ చర్యలు చేపట్టామని, శుభ్రత విషయంలో, కరోనా విషయంలో ప్రజలను అప్రమత్తం చేశామని, అవసరమైతే మరో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని కేటీఆర్ ప్రకటించారు. తడి పొడి చెత్త సేకరణ కోసం పంపిణీ చేసిన బుట్టలను వినియోగంలోకి తీసుకురావాలని, ఇండ్ల వద్దకు వచ్చే ఆటో డ్రైవర్లకు అందజేయాలని పిలుపునిచ్చారు. నగర స్వచ్ఛత కోసం జీహెచ్ఎంసీ అధికారులు, కార్మికులు నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నారని అభినందించారు. శానిటేషన్‌పై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. 325 స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వం, జీహెచ్ఎంసీతోనే కాదని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని, ఇప్పటి వరకూ 2,500 వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. చెత్తకుండీలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.













