తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్…?
తెలంగాణలో బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు గత కొన్ని రోజులుగా వినపడుతున్నాయి. అయితే ఎవరి మధ్య విభేదాలున్నాయి ఏమిటనేది తెలియదు కానీ ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో మాత్రమే వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. బండి సంజయ్ కొన్ని రోజులుగా బిజెపి నాయకుల విషయంలో చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణలో నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా ఆయన స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు అనే భావన కొంతమందిలో ఎక్కువగా ఉంది. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే విషయంలో తాను ఎక్కువగా ముందుంటున్నారు అనే భావనలో కూడా బండి సంజయ్ ఎక్కువగా ఉన్నారని అందుకే కొంతమంది నేతలను కలుపుకొని వెళ్లకుండా స్వతంత్రంగా ముందుకు వెళుతున్నారని అంటున్నారు.
స్వతంత్రంగా రాజకీయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. దీనివలన భారతీయ జనతా పార్టీలో కూడా ఆయనకు ఇప్పుడు ప్రత్యర్థులు తయారవుతున్నారు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనపై చాలా సీరియస్గా ఉన్నారు అని టాక్. కేంద్ర నాయకత్వానికి కూడా బండి సంజయ్ విషయంలో ఫిర్యాదు చేశారని అంటున్నారు. రాజకీయంగా ఈ పరిస్థితి బండి సంజయ్ కి ఎంత మాత్రం కూడా మంచిది కాదు. వాస్తవానికి కిషన్ రెడ్డి తెలంగాణలో ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. సీనియర్ నేత కావడంతో ఆయనకు కేంద్రంలో కూడా పదవి లభించింది.
ఇక పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఆయన విషయంలో సానుకూలంగా ఉంటారు. అందరితో కూడా సన్నిహితంగా ఉండటమే కాకుండా ఇతర పార్టీలతో కూడా సన్నిహితంగా మెలగుతూ కొంతమంది నేతలను ఆయన దగ్గర చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళే. కాబట్టి బండి సంజయ్… కిషన్ రెడ్డి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని టార్గెట్గా చేసుకుని కిషన్ రెడ్డికి బండి సంజయ్ కి విభేదాలు ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా కిషన్ రెడ్డిని పక్కన పెడుతున్నారని దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు. మరి ఈ సమస్యలను బిజెపి కేంద్ర నాయకత్వం ఎంతవరకు పరిష్కరిస్తుందో చూడాలి.













