GST పై స్పందించకుంటే న్యాయపోరాటం తప్పదు : కేసీఆర్
ఏకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన GST పై ఆనేక విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలైన ప్రాజెక్టులు, ఇతర నిర్మాణ పనులపై విధించిన 12శాతం GSTని తగ్గించేవరకు రాజీలేని పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం స్పందించకుంటే న్యాయపోరాటం తప్పదని తేల్చిచెప్పారు. జూన్ 30నాటికే ప్రారంభమైన ప్రాజెక్టు పనులమీద జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన GSTని వర్తింపజేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.
గతంలో అమలులో ఉన్న 5శాతం వ్యాట్‌ను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ కేటాయింపులు జరిగినందున.. ఇప్పటికిప్పుడు అంచనాలను సవరించడం కుదురదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. GST వల్ల జరిగే నష్టంమీద పూర్తి వివరాలతో ప్రధానికి లేఖ రాస్తానని, సానుకూల స్పందన రాకపోతే న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై విధిస్తున్న 12శాతం GSTని గతంలో మాదిరిగా 5శాతానికి తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. GST కారణంగా ఏయే ప్రాజెక్టులపై ఎంత పన్ను పడుతుంది? వ్యయ భారం ఎంత పెరుగుతుంది..? రాష్ట్ర ఖజానాకు ఎంత నష్టం.. దానిని ఎలా భరించాలి? అనే అంశాలమీద ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం ఆదివారం(ఆగస్టు-6) ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా సమీక్షించారు. గతంలో అమలులో ఉన్న వ్యాట్ స్థానంలో ప్రస్తుతం GST వల్ల వచ్చే తేడామీద ముఖ్యమంత్రి లోతైన చర్చ జరిపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు సోమేశ్‌కుమార్, డీ ప్రభాకర్‌రావు, ఎస్కే జోషి, శివశంకర్, శాంతికుమారి, సందీప్‌సుల్తానియా, అనిల్‌కుమార్, దానకిశోర్, జనార్దన్‌రెడ్డి, శ్రీదేవితోపాటు నీటిపారుదల శాఖకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఆయా శాఖల అధికారులు జీఎస్టీ భారం మీద ప్రాథమిక అంచనాలను సీఎం ముందుంచారు. వాస్తవానికి ఆదివారమే(ఆగస్టు-6) ప్రధానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి భావించినా.. కచ్చితమైన లెక్కల కోసం వాయిదా వేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటి పారుదల ప్రాజెక్టులు, డబుల్ బెడ్రూం నిర్మాణాలు, విద్యుత్ ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం తదితర అంశాల్లో కచ్చితమైన గణాంకాలను పొందుపరిచి లేఖ పంపాలని సీఎం నిర్ణయించారు. దీనిపై సోమవారం(ఆగస్టు -7) వివిధ శాఖల అధికారులు మరోసారి సమావేశమై గణాంకాలకు తుదిరూపమివ్వనున్నారు. పూర్తి వివరాలు అందగానే ప్రధానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు.













