WTF: తెలుగులోనే మాట్లాడండి…తెలుగు వైభవాన్ని చాటండి.. డబ్ల్యుటిఎఫ్ మహాసభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాజకీయాలు, ఆర్థికం, సినిమా ఇలా ఏ రంగంలోనైనా రాణించాలంటే నాలెడ్జ్ సంపాదించండి. ఏ భాష అయినా నేర్చుకోండి. కానీ తెలుగులోనే మాట్లాడుకోండి. దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న రెండో భాషగా తెలుగు నిలిచింది. సుమారు 18 కోట్ల మంది తెలుగులో మాట్లాడుతారు. కానీ ఈ స్థాయిలో దేశ రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నాం. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించడంలో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగు భాషను, ఉనికిని, మనుగడను, మన సంప్రదాయాన్ని కోల్పోకుండా కాపాడుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. దీనికి గల కారణాలను విశ్లేషించుకోవాలి..’’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు ఫెడరేషన్ సభల ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు.
‘‘దేశ రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డి, పీవీ, ఎన్టీఆర్.. తర్వాత కాకా, జైపాల్‌రెడ్డి వంటివారు ప్రభావం చూపించారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర సన్నగిల్లింది. తర్వాత చట్టసభల్లో తెలుగువారు ఎవరు మాట్లాడుతారా? అని ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. అయితే ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రపంచ తెలుగు ఫెడరేషన్ ప్రపంచం ముందు తెలుగు ప్రజలు తలెత్తుకునేలా ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. ఇలాంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల మన బాధ్యతను గుర్తుచేసినట్టు అవుతుంది. ఎవరెస్ట్ ఎక్కి చూసినా అక్కడో మలయాళీ ఉంటాడనే నానుడి ఉంది. ఇప్పుడలా తెలుగువారు కనిపిస్తున్నారు. సినిమా రంగంలో హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్నాం.
రాజీవ్‌గాంధీ దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేశారు. హైదరాబాద్ ప్రాంతం సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చెందింది. ప్రపంచంతో పోటీపడేలా ఆర్థికంగా అవకాశాలు కల్పింస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఔటర్ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు కట్టి ఐటీ, ఫార్మా కంపెనీల ఏర్పాటును ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. విడిపోయి పోటీపడే కంటే కలసి ఉండి అభివృద్ధి వైపు నడిస్తే కచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు నిలుస్తాయి. దేశాల మధ్య యుద్ధాలకే చర్చలు పరిష్కారం చూపిస్తుంటే.. రాష్ట్రాల మధ్య సమస్యలకు చర్చలు దారి చూపవా?.
హైదరాబాద్ విశ్వనగరంగా రాణిస్తుందని భరోసా ఇస్తున్నాం. రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తున్నాం. వరంగల్, రామగుండం, ఆదిలాబాద్, భద్రాచలంలో ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. ఔటర్ రింగురోడ్డు ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడిరది. ఇకపై రీజనల్ రింగ్‌రోడ్డుతో తెలంగాణ రాష్ట్రాన్ని 60 శాతం పట్టణీకరణ చేసేలా ప్రభుత్వం పనిచేస్తోంది. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణ రైజింగ్ స్లోగన్‌తో 2050 లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నాం. అందరినీ సాదరంగా ఆహ్వనిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.