ఆమె అరెస్టుపై కేసీఆర్, మోదీ ఎందుకు ..మౌనంగా ఉన్నారు : సీఎం రేవంత్

మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లామని ప్రస్తుతం తాము ప్రజల్లోనే ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. మా వంద రోజుల పాలన సంపూర్ణ సంతృప్తినిచ్చింది. అధికారం చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశాం. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించాం. ఉచిత విద్యుత్ హామీ అమలులో భాగంగా 38 లక్షల జీరో బిల్లులు అందజేశాం. ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు లక్ష్యంగా పనిచేశాం. పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించి, ఆదాయాన్ని స్థిరీకరించాం అని అన్నారు.
కవిత అరెస్టు విషయంపై సీఎం స్పందించారు. కవిత అరెస్టును కేసీఆర్ ఖండిరచలేదు. ఆయన మౌనాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. ఆమె అరెస్టుపై కేసీఆర్, నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు. దాని వెనక వ్యూహం ఏంటి? అని ప్రశ్నించారు. గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారు. కానీ నిన్న మాత్రం మోదీ, ఈడీ కలిసే వచ్చారు. కేసీఆర్ కుటుంబం, బీజేపీ మద్యం కుంభకోణాన్ని నిరంతర ధారావాహికలా నడిపించారు. ఈ అరెస్టు బీజేపీ, బీఆర్‌ఎస్ ఆడుతున్న డ్రామా. ఎన్నికల షెడ్యూల్‌కు ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలన్ని చెబుతున్నాయి. మమ్మల్ని దెబ్బతీసేందుకు బీజేపీ`బీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. ఈ అరెస్టు ఎన్నికల స్టంట్. రాష్ట్రానికి మోదీ చేసిందేమీ లేదు. ప్రధానిగా ఆయన చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదు. తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదు అని మండిపడ్డారు.