ఆగస్టులోపే 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తాం : సీఎం రేవంత్

ఆగస్టులోపే 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ గురువారం సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. తొలి విడతగా రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధుల విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోపు రూ.1.5 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆగస్టులో రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాపీ చేస్తామని తెలిపారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో చెప్పాం. ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియాగాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు.
రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయి. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే రుణమాపీ చేస్తున్నామన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించండి. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండి. ఈ అంశంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంట్‌లో ఎంపీలు ప్రస్తావించాలి. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలి. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కడికక్కడ ఒక పండుగ వాతావరణంలో సంబరాలు జరపాలి. ఏడు నెలల్లో మన ప్రభుత్వం సంక్షేమానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.