మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ఉద్దేశం : సీఎం రేవంత్
మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రూ.1200 ఉందని, త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని తెలిపారు. స్కూల్ యూనిఫామ్‌లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయన్న సీఎం, త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకని ప్రశ్నించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1450 డ్వాక్రా సంఘాలకు సుమారు రూ.60 కోట్లకుపైగా రుణాలు పంపిణీ చేశారు.













