ప్రదాని మోదీ నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు : సీఎం రేవంత్

కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల అండతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు గతం కంటే భిన్నమన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలవాలని బీజేపీ చూస్తోందని, తద్వారా దేశాన్ని అమ్మేయాలని భావిస్తోందని వ్యాఖ్యానించారు. బలహీన వర్గాలకు దక్కాల్సిన అవకాశాలు, నిధులు రాలేదు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చింది. రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎటు వెళ్లాలి? ఈ అంశంపై నేను ప్రశ్నించా. మోదీ, అమిత్ షా నాపై పగబట్టి ఢల్లీిలో కేసు పెట్టారు. ఈడీ, సీబీఐ, ఐటీతోనే కాదు, ఢల్లీి పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారు. చర్లపల్లి జైలుకు కేసీఆర్ పంపితే తిరగబడి కొట్లాడాం. మీ దగ్గర సీఐడీ, ఈడీ పోలీసులు ఉండొచ్చు. నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలున్నారు. మోదీ గుజరాత్ వ్యక్తిలా వచ్చి మనల్ని తిట్టారు. శంపిచారు. ఐదు రోజుల్లో ఇస్తామన్న పసుపు బోర్డు ఐదేళ్లయినా ఇవ్వలేదన్నారు.
20 ఏళ్ల నుంచి ఎన్నో అటుపోట్లు చూశా. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చేద్దామనుకుంటున్నారు. తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి మధ్య ఈ ఎన్నికల్లో పోటీ. ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ కుట్రలు బయటపెడతా. రాజ్యాంగాన్ని ఎలా మార్చాలని చూస్తోందో వివరిస్తా. రాజ్యాంగం మార్పు అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలోనే చేర్చారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తా. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పినందుకు నాపై కేసా? గుజరాత్ నుంచి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డపై నిలబడి సీఎంను బెదిరిస్తారా? మోదీ భయపెడితే బెదరడానికి ఇక్కడెవరూ లేరు అని అన్నారు.