రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ… ఈ ఎన్నికల్లో కుట్ర : సీఎం రేవంత్

దేశం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరులో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలనే లక్ష్యంతో బీజేపీ ఈ ఎన్నికల్లో ముందుకెళ్తోందని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. రిజర్వేషన్ల రద్దు ప్రతిపాదికన ఎన్నికలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. 50 వేల మెజారిటీతో మధును గెలిపించాలని కోరారు. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలుంటేనే పెట్టుబడులు వస్తాయని, యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పని చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పటాన్‌చెరు ప్రాంతంలో అభివృద్ధి జరగలేదన్నారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఫ్రంట్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని ఆరోపించారు.