ఏపీ ఎన్నికలపై తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఏపీలో పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. అయితే తెలంగాణతో పోల్చితే ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఈ క్రమంలోనే ఆంధ్రాలో ఏర్పడబోయే ప్రభుత్వంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఏర్పడబోతున్న ప్రభుత్వం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలోకి ఎవరొచ్చినా ఆ ప్రభుత్వంతో తాము సఖ్యతగా ఉంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. “నేను ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ మాత్రమే చేస్తా. నెగిటివ్ థింకింగ్ ఉండదు. తెలంగాణ భవిష్యత్ మాత్రమే నాకు ముఖ్యం. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ కోసం 100 సంవత్సరాల ప్రణాళిక రూపొందిస్తున్నాం. దాని ప్రకారమే పాలన కొనసాగిస్తాం. అందుకే పక్క రాష్ట్రంతో సఖ్యతగా ఉండాలని నిర్ణయించుకున్నాం” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.