రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా.. లక్ష ఎకరాలకు నీరివ్వలేదు : రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. అనంతరం కాలేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై ఇన్‌ఛార్జి చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గతేడాది అక్టోబరు 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు వివరించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లక్ష ఎకరాలకు నీరు అందక పోయినా, కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని గొప్పలు చెప్పారని విమర్శించారు. నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినప్పటికీ సమస్యను చక్కదిద్దే పని చేయకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టు రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.













