అవును తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీనే : సీఎం రేవంత్
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని, దానిలో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పెంపు హామీలను అమలు చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ లీడర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో మరో రెండు హామీలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాకముందే బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చినా నెల మొదటి తారీఖకే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. అలాగే రైతు బంధును ఫిబ్రవరి నెలాఖరులోగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన హమీలు అమలు చేశారా? పదేళ్లలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలి. కొందరు నన్ను మేస్త్రి అని విమర్శిస్తున్నారు. అవును తెలంగాణను పునర్నిర్మించే మేస్తినే అని అన్నారు.
పదేళ్లు అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితబంధు, బీసీ బంధు సహా ఏ హామీని కూడా అమలు చేయలేదని అన్నారు. తనకు ఈ పదవి, హోదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చినవే అన్నారు. కార్యకర్తల కఠోర శ్రమ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. వాళ్లు పెట్టిన భిక్షతోనే ఈ రోజు తాను ఈ స్థానంలో ఉన్నానని భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తలతో పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ, కర్నాటకలో అధికారంలోకి రావడం చాలా ప్లస్ అయిందని అన్నారు.













