బీఆర్ఎస్ లా కాదు కాంగ్రెస్ లో .. ఎవరైనా కావొచ్చు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది. అమెరికా పర్యాటనలో ఉన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అవసరమైతే సీతక్క కూడా ముఖ్యమంత్రి కావొచ్చునని వ్యాఖ్యానించారు. దీనిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే కూడా ఈ అంశంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చని వ్యాఖ్యానించారు. తమ పార్టీలో ఒకరు కాదు చాలా మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి, కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మధుయాష్కీగౌడ్, దామోదర్ రాజనర్సింహా, మల్లు భట్టివిక్రమార్క, ఇలా చాలా మంది నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలా తమ పార్టీకి కాదని, ఆ పార్టీలో కుటుంబంలో వారే ముఖ్యమంత్రి అవుతారని విమర్శించారు. ఇంతమంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు.













