23న ఆంధ్రప్రదేశ్ కు సీఎం కేసీఆర్ రాక
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 23న ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖకు బయల్దేరతారు. విశాఖలో శారద పీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు. 24న కోణార్క్, పూరీ జగన్నాథ్ ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం భువనేశ్వర్ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు వెళ్తారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతారు. ఆ తర్వాత కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదే రోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు.













