పీవీ విగ్రహం చూస్తుంటే కడుపు నిండిపోతుంది : సీఎం కేసీఆర్

మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. పీవీ నరసింహా రావు శత జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహాన్ని పూల మాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీవీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. మరోవైపు గవర్నర్ తమిళిసై ‘పీవీ మార్గ్’ను కూడా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ…. పీవీ నరసింహారావు తెలంగాణ ముద్దుబిడ్డ అని కొనియాడారు. ఆయనను ఎంత స్మరించుకున్నా తక్కువేనని, పీవీ ఓ కీర్తి శిఖరం అని ప్రశంసించారు. చాలా సంవత్సరాల క్రితం ముందు చూపుతో ఆయన అనేక సంస్కరణలు తెచ్చారని, వాటి ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని, అవన్నీ మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. వాటి ఫలితమే దేశంలో అనేక రంగాల్లో పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడుతున్నాయని అన్నారు. పీవీ అనగానే భూ సంస్కరణలు గుర్తుకు వస్తాయని, ఇతర రాష్ట్రాలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకొని, అమలు చేస్తున్నాయని వివరించారు. అత్యంత నిబద్ధతతో ఆయన భూ సంస్కరణలను అమలు చేశారని తెలిపారు. ఇక విద్యా సంస్కరణలు కూడా తీసుకొచ్చారని, గురుకుల పాఠశాలలకు ఆద్యుడు పీవీ అని, ఎందరో మంది అందులో చదువుకొని, దేశానికి సేవలందిస్తున్నారని సీఎం తెలిపారు. పీవీ నరసింహా రావు విగ్రహాన్ని చూస్తుంటే కడుపు నిండిపోయినట్లుందని, నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్ అని పేరు పెట్టడం మరింత ఆనందదాయకమని అన్నారు. కాకతీయ వర్శిటీలో ‘పీవీ పీఠం’ పెడతామని ప్రకటించారు. పీవీ అనేక రచనలు చేశారని, ఆయన ఓ దీపస్తంభం అని సీఎం కేసీఆర్ కొనియాడారు.