సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో రాజశ్యామల యాగం
తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాగానికి అంకురార్పణ జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రత్యేకంగా హాజరైన పండితులు మూడు రోజులపాటు ఈ యాగం నిర్వహించనున్నారు.
మొదటి రోజు యాగంలో భాగంగా గోపూజ అనంతరం కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకురార్పణ చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్ దంపతులు సాష్టాంగ నమస్కారం చేసి యాగంలో ఆసీనులయ్యారు. గురు ఆజ్జ తీసుకుని యాగాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సస్యశ్యామలంగా కళకళలాడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగాన్ని తలపెట్టారని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. రాజశ్యామల యాగం విశాఖ శ్రీశారదపీఠానికి ప్రత్యేకమని స్పష్టం చేశారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ యాగంలో రెండోరోజు వేదపారాయాణలు, హోమం, తదితర క్రతువులు నిర్వహిస్తారు. చివరిరోజు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు.













