ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఇది కూడా ఒక కారణం : సీఎం కేసీఆర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, రైతులు అనేక సమ్యలు ఎదుర్కొన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఇది కూడా ఒక కారణమన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 కిలోల బంగారు కిరీటాన్ని స్వామివారికి వారు అలంకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ తిరుపతి దేవస్థానంగా ప్రసిద్ధి చెందిన తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి గతంలో 23 కోట్లు మంజూరు చేయగా, తాజాగా అదనంగా మరో రూ.7 కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.
గతంలో నేను ఇక్కడికి వచ్చినపుడు ఓ మాదిరిగా ఆలయం ఉండేది. ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అప్పట్లో అనుకున్నాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వయంగా కొద్దిమంది మిత్రులతో కలిసి ఆయలాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. తెలంగాణ ప్రాంతమంతా పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నా. ఈ ప్రాంతంలో కొన్ని పనులు చేయాల్సి ఉంది. వాటిని త్వరలోనే పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గానికి 50 కోట్లు మంజూరు చేస్తాం. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి పోచారం శ్రీనివాసరెడ్డి ఎంతో కష్టపడ్డారు. ఆయన ఇంకెంతో కృషి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. పోచారం వయసు పెరుగుతోందని, అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాన్సువాడకు ఆయన ఇంకా సేవ చేయాల్సిందే. నాకు 69 ఏళ్లు వచ్చాయి. ముసలోడిని అవుతున్నా అని సీఎం సరదాగా మాట్లాడారు.













