ఘనంగా టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం
హైదరాబాద్లోని కొంపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేశారు. పార్టీకి ఇది 17వ ప్లీనరీ కాగా, ప్రభుత్వ ఏర్పాటు చేసిన తర్వాత నాలుగోది. ప్లీనరీ వేదికకు తెలంగాణ ప్రగతి వేదిక గా నామకరణం చేశారు. ఈ ప్లీనరీలో రాష్ట్ర, జాతీయ రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించడంతో పాటు పార్టీ శ్రేణులకు అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ముందుగా వేదికపైన ఆటపాటలతో కళాకారులు, ప్లీనరీకి వచ్చిన వారిని ఉత్సాహపరిచారు.
ప్లీనరీకి సుమారు 2 వేల పోలీసులతో భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో రహదారులపై నిఘా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్లీనరీకి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పోలిట్బ్యూరో సభ్యులు, పార్టీ అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పలువురు కార్యకర్తలు హాజరయ్యారు.













