బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా ఉచితం : కేసీఆర్
ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని తెలిపారు. కేంద్రం నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టి చోద్యం చూస్తోందని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా నీటి యుద్ధాలు ఎందుకని ప్రశ్నించారు. దశాబ్దాల క్రితం కట్టిన ప్రాజెక్టులు తప్ప కొత్తవి మళ్లీ కట్టలేదని, ఏండ్లు గడుస్తున్నా నీటి వివాదాలు పరిష్కారం కావడం లేదని అన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, మిషన్ భగీరథ తరహాలో ఐదేళ్లలో ఇంటింటికీ మంచి నీళ్లు అందిస్తామన్నారు. దేశంలో 4 లక్షల 10 వేల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉన్నా, తెలంగాణ తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరెంటు సమస్య ఎందుకుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ భావజాలం ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశంలో వెలుగుజిలుగులు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. కష్టాలు కన్నీళ్ల నుంచి దేశ ప్రజల్ని కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టిందని అన్నారు. సహజ వనరులు ప్రజలకు దక్కేలా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యమని అన్నారు. మోదీ హయాంలో తెలంగాణ తప్ప దేశమంతటా కరెంటు కోతలే ఉన్నాయని విమర్శించారు. అసలు దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, లక్షల కోట్ల సంపద ఏమైపోయిందో తెలియడం లేదని అన్నారు.













