‘కర్నాటక సాహిత్య మందిర’ పునర్నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరు
హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్ధాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని, వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్ కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.
కన్నడిగుల కోసం హైదరాబాద్ లో గల సాహిత్య వేదికను పునరుద్ధరించాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న కర్నాటక వాసులు మరియు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేశ్ విజ్జప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ కాచిగూడలో గల ‘కర్నాటక సాహిత్య మందిర’ పునర్నిర్మాణం కోసం రూ. 5 కోట్లను సీఎం మంజూరు చేశారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను అధికారులను సీఎం ఆదేశించారు. సాహిత్య, సాంస్కృతక కార్యక్రమాలతో పాటు కమ్యునిటీ అవసరాల కోసం వినియోగించుకునే విధంగా మౌలికవసతులను ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేకు సీఎం సూచించారు. కాగా తమ విజ్జప్తి మేరకు రూ. 5 కోట్లను మంజూరు చేసినందుకు సీఎంకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఈరోజు ప్రగతి భవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపారు.













