‘పోడు’కు బదులు సర్కారీ భూమి
అడవుల లోపల పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా సమీపంలోని ప్రభుత్వ భూములను కేటాయించాలని.. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే అడవుల అంచున భూమిని ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీనితోపాటు వారికి నీరు, విద్యుత్, నివాస సదుపాయాలు కూడా కల్పించాలని.. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యపై ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఇటీవల సమీక్షించారు. పోడు సాగుచేస్తున్న గిరిజనులు, గిరిజనేతరుల నుంచి దరఖాస్తుల స్వీకరణను వచ్చే నవంబర్ 8న ప్రారంభించాలని.. డిసెంబర్ 8 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు వచ్చేనెల 8లోగా అన్నిస్థాయిల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్)2006 ప్రకారం గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని.. రెండు, మూడు గ్రామాలకో నోడల్ అధికారిని నియమించాలని, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.













