ఆ నాలుగు జిల్లాల్లో లాక్డౌన్ కఠినం!
కరోనా బాధితుల్లో ఎక్కువ మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న మరో 3 జిల్లాల వారే ఉంటున్నారని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆర్యోగశాఖ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వవద్దని కోరారు. మిగతా జిల్లాల్లో కేసులు బాగా తగ్గాయని, అక్కడ కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గిందని వివరించారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో 8 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నిబంధనల సడలింపు అంశాలు చర్చకు వచ్చాయి. సోమవారం మూడే కేసులు నమోదు కావడం, 40 మంది కోలుకోవడం శుభసూచకమని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారులు ప్రభుత్వానికి తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించారు. దీనిపై కేబినెట్ సమావేవంలో చర్చించే అవకాశం ఉంది. లాక్డౌన్ ఆంక్షలు, వైరస్ వ్యాప్తి తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు.













