ప్రభుత్వం సహకరిస్తున్నా, పనులు పెండింగ్ ఎందుకున్నాయ్? సీఎం కేసీఆర్

నిర్దేశించిన ఏ పని కూడా పెండింగ్‌లో ఉండడానికి వీల్లేదని, అన్ని పనులూ పూర్తి చేసేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సూచించారు. జూలై 1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి, హరిత హారం విషయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలు హాజరయ్యారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం బాగా సహకరిస్తున్నా, పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో చూసుకోవాలని పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటికీ 6 మొక్కలు ఇచ్చి, నాటించేలా చూడాలని ఆదేశించారు. తెలంగాణ ధాన్యాగారంగా మారిపోయిందని, ధాన్యాలతో తులతూగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రానికి అదనపు రైసు మిల్లులు కావాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూసుకోవాలని, ఈ విషయంలో కలెక్టర్లు, ఉన్నతాధికారులు విచక్షణాధికారాలను వాడుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.