ఇకపై వరంగల్, హన్మకొండ జిల్లాలుగా పిలుస్తాం : కేసీఆర్ ప్రకటన
వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలు అని పేర్లు మారుస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంచలన ప్రకటన చేశారు. ఈ జిల్లాల నూతన పేర్లపై రెండు, మూడు రోజుల్లోనే ఉత్తర్వులు కూడా వస్తాయని ప్రకటించారు. అంతేకాకుండా వరంగల్, హన్మకొండలో వేర్వేరు కలెక్టరేట్ల నిర్మాణాలను కూడా చేపడతామని హామీ ఇచ్చారు. ఇకపై వీటిని అందరూ వరంగల్, హన్మకొండ జిల్లాలని పిలవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా 25 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత కలెక్టర్ భవన సముదాయన్ని ప్రారంభించారు. అలాగే సెంట్రల్ జైలు మైదానంలో 24 అంతస్తులతో నిర్మించినున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తదనంతరం కాళోజీ హెల్త్ యూనివర్శిటీలో అత్యాధునిక వసతులతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. పరిపాలనలో సంస్కరణలను అత్యధికంగా తెచ్చుకున్నామని, అవన్నీ పరిపుష్టమై, తెలంగాణ సమాజానికి ఫలాలు అందాలని ఆకాంక్షించారు. అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయని, ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలించడమే నిజమైన పాలన అని అభిప్రాయపడ్డారు.
‘కలెక్టర్’ అన్న పేరు మార్చాల్సిందే : సీఎం
కలెక్టర్ అనే పేరు కూడా మార్చేస్తే బాగుంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కలెక్టర్ అనే పదం బ్రిటీష్ కాలంలో పెట్టిన పేరని, ఒకప్పుడు భూమి శిస్తు వసూలు చేసేవార్ని కలెక్టర్ అని పిలిచేవారని గుర్తు చేశారు. ఇప్పుడు కలెక్టర్లకు శిస్తు వసూలు చేసే అవసరమే లేదని, అందువల్ల వారి హోదా పేరును మార్చేయాలని పేర్కొన్నారు.
జూలై 1 నుంచి ‘పల్లె ప్రగతి’ షురూ…
జూలై 1 నుంచి 10 వరకూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రటకించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి రెండు కలిపే నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 26 న కలెక్టర్లు, మంత్రులు, జిల్లా పంచాయతీ అధికారులు, అడిషనల్ కలెక్టర్లందరితో సమావేశం ఉంటుందని తెలిపారు. ఆ రోజే ఎజెండాను రూపొందిస్తామని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో అనుకున్నంత అభివృద్ధి జరగడం లేదని మళ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ గ్రామం అభివృద్ధి చెందుతోందని, గ్రామాలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెలిగిపోవాలని సీఎం ఆకాంక్షించారు.
అన్ని ఆలోచించే లాక్డౌన్ ఎత్తేశాం : సీఎం వివరణ
తెలంగాణలో ఒకేసారి లాక్డౌన్ ఎత్తేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇచ్చారు. పేదల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకునే లాక్డౌన్ ఎత్తేశామని స్పష్టం చేశారు. దాదాపుగా సగం జిల్లాల్లో కరోనాయే లేదని అధికారులు తెలిపారని, వైద్యాధికారులతో చర్చించిన తర్వాతే లాక్డౌన్ సంపూర్ణంగా ఎత్తేశామని వెల్లడించారు. సడలింపుల సమయాన్ని భారీగా పెంచినా, కరోనా పాజిటివిటీ పెరగలేదని, ఇవన్నీ ఆలోచించిన తర్వాతే ఎత్తేశామని పేర్కొన్నారు. అన్నీ ఆలోచించిన మీదటే లాక్డౌన్ ఎత్తేశామని, దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
‘కెనడా’ గా మారిపోవాలి : సీఎం
వరంగల్ గొప్ప విద్యా, వైద్య కేంద్రంగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. అలాగే పరిశ్రమల కేంద్రంగా కూడా మారాలని, తూర్పు తెలంగాణకు ఓ హెడ్‌క్వార్టర్‌లా మారిపోవాలని అన్నారు. ప్రపంచంలో అత్యంత అధునాత వైద్య సదుపాయాలు కెనడలో ఉన్నాయని, కెనడాను తలదన్నేలా వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ నిర్మాణం జరగాలని అభిప్రాయపడ్డారు. అతి త్వరలోనే అధికారులతో కలిసి కెనడాను సందర్శించాలని, వాటికి అనుగుణంగా జరగాలని సూచించారు. వరంగల్‌కు డెంటల్ కాలేజీని, డెంటల్ హాస్పిటల్‌ను మంజూరు చేస్తున్నామని, హైదరాబాద్ సిటీ నుంచి కూడా వైద్యానికి వరంగల్‌కు వచ్చేలా చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.













