సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. మహబూబాబాద్ జిల్లాకు కొత్తగా
మహబూబాబాద్ జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంబించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహబూబాబాద్ గతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం అని, ఇప్పుడు జిల్లా అయ్యాక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. జిల్లాకు కొత్తగా ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి తెచ్చేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో అనేక తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు, జిల్లాలోని మిగిలిన డోర్నకల్, మరిపెడ, తొర్రూరు పట్టణాలకు రూ.25 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోనూ పక్షపాత వైఖరి లేని ప్రభుత్వం ఉంటేనే దేశం బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశ అభివృద్ధిలోనే మన అభివృద్ధి ఇమిడి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తు రాజకీయాల్లో దేశానికే ఓ వెలుగు మార్గం చూపించే అద్భుతమైన చైతన్య వీచిక మన తెలంగాణ నుంచే వీయాలని ఆయన ఆకాక్షించారు. గతంలో తాను ఏ కార్యక్రమానికి పులుపునిచ్చినా ప్రజలు అద్భుతంగా స్పందించి సహకరించారని తెలిపారు. ఇప్పుడు కూడా దేశ అభివృద్ధి కోసం చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.













