నల్గొండ జిల్లా పంచాయతీలకు సీఎం కేసీఆర్ కానుక
నల్గొండ జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కానుక ప్రకటించారు. జిల్లా పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున, మండల కేంద్రాలకు రూ.30 లక్షల చొప్పున నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నల్గొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5 కోట్లు, జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. సీఎం ప్రత్యేక నిధి నుంచి వాటిని విడుదల చేస్తామని.. రేపే ఉత్తర్వులు జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. నెల్లికల్లు, చింతలపాలెం పరిధిలోని భూముల వివాదాన్ని రెండు మూడు రోజుల్లో పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.
నల్గొండ అనాదిగా చాలా నష్టపోయిన జిల్లా. ఏ నాయకుడూ, ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. గతంలో హుజూర్నగర్ ఎన్నిక జరిగినప్పటి నుంచి నిరంతరం నా దృష్టికి సమస్యలు వస్తున్నాయి. రూ.2,500 కోట్లతో ఎత్తిపోతల పథకాలు మంజూరు చేశాం. ఏడాదిన్నరలోపు వాటిని పూర్తి చేసి నీరందిస్తాం. టీఆర్ఎస్ వీరుల పార్టీ..వీపు చూపించే పార్టీ కాదు. నేను మాటిస్తున్నా.. నేతలు పూర్తి చేయాలి. ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం. పార్టీ నేతలు ఎక్కడికక్కడ సహకరించి ఎత్తిపోతల పథకాలు ఏడాదిన్నరలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రైతులకు అవసరమైతే గోదావరి నీళ్లు పెద్దదేవలపల్లికి తీసుకొచ్చి కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి వారి బాధలు తీరుస్తాం. గిరిజనుల పోడుభూముల సమస్యను త్వరలో పరిష్కారిస్తాం. నాతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్న నోముల నర్సింహయ్య నా పక్కన లేకపోవడం బాధగా ఉంది అని కేసీఆర్ అన్నారు.













