గజ్వేల్ నా గౌరవాన్ని పెంచింది.. నన్ను ఈ స్థాయికి తెచ్చింది : కేసీఆర్
గజ్వేల్ నా గౌరవాన్ని పెంచింది. ముఖ్యమంత్రిని చేసి నన్ను ఈ స్థాయికి తెచ్చింది అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గజ్వేల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అద్భుత రాష్ట్రంగా మారాలి. పేదలు లేని రాష్ట్రంగా రూపు దిద్దుకోవాలి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీగా తెలంగాణ తయారుకావాలి. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు అభివృద్ధి చేశా. గత 24 సంవత్సరాలుగా తెలంగాణనే ఆశగా శ్వాసగా బతుకుతున్నా. గజ్వేల్‌కు కచ్చితంగా ఐటీ టవర్లు తీసుకొస్తాం. కొండ పోచమ్మ ఆలయాన్ని అద్భుతంగా మార్చుకుందాం. గజ్వేల్ అభివృద్ధి చూడడానికి తండోపతండాలుగా వచ్చారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి కోమటిబండ అభివృద్ధి చూశారు. గజ్వేల్ మీదుగానే ఆర్ఆర్ఆర్ రాబోతోంది. గజ్వేల్ ఒక రోల్ మోడల్‌గా ఎదిగింది. మరోసారి నాకు అవకాశమిస్తే ఈ కీర్తిని మరింత ఇనుమడిరపజేసే విధంగా గజ్వేల్ అభివృద్ధిని ఆకాశాన్ని తీసుకుపోయే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాల ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. వారి త్యాగం వల్లే ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు పుష్కలంగా అందుతోంది. వారి ప్రాంతంలో పరిశ్రమలు పెట్టించి ఉపాధి కల్పిస్తాం. రాబోయే రోజుల్లో డజను వరకు కాలుష్య రహిత పరిశ్రమలు వస్తాయి. పంటల వైవిధ్యం నేర్చుకుని వాణిజ్య పంటలు పండిద్దాం. జోన్లుగా విభజించి రైతులకు లాభం వచ్చే విధంగా చేద్దాం అని అన్నారు.













